Russia-Ukraine War | రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడు సంవత్సరాలకుపైగా యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై శనివారం భారీ దాడులకు దిగింది. ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఈ దాడిని ఆయన క్రూరమైన చర్యగా అభివర్ణించారు. రష్యా పదేపదే ఉక్రెయిన్ రైల్వే లైన్లను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు. ప్రయాణీకులు, రైల్వే కార్మికులతో సహా ఇప్పటివరకు కనీసం 30 మంది గాయపడ్డారని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఓ రైలు బోగీ మంటల్లో కాలిపోతున్న వీడియోను షేర్ చేశారు. రష్యన్లు పౌరులపై దాడి చేస్తున్నారని తమకు తెలుసని జెలెన్స్కీ పేర్కొన్నారు.
ఈ దాడి రష్యా సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో జరిగిందని.. దీనికి ముందు రష్యా పవర్ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని, అనేక డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించినట్లుగా ఉక్రెయిన్ ఆరోపించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కొనసాగాయని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి జరిగిందని.. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. రష్యా జరిపిన ఈ దాడిలో రష్యా సరిహద్దుకు ఉత్తరాన ఉన్న చెర్నిహివ్ నగరానికి సమీపంలో ఉన్న విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా దాదాపు 50వేల గృహాలు విద్యుత్ సదుపాయాన్ని కోల్పోయినట్లుగా ప్రాంతీయ విద్యుత్ ఆపరేటర్ చెర్నిహివ్వోబ్లెనెర్గో చెప్పారు. రాత్రిపూట జరిగిన దాడిలో నగరంలో అనేక మంటలు చెలరేగాయని చెర్నిహివ్ సైనిక పరిపాలన అధిపతి డిమిట్రో బ్రైజిన్స్కీ తెలిపారు. అయితే, నష్టం ఎంత వరకు జరిగిందో మాత్రం చెప్పలేదు. ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకారం.. శుక్రవారం రష్యా మొత్తం 381 డ్రోన్లు, 35 క్షిపణులను ప్రయోగించింది.
చలికాలానికి ముందు ఉక్రెయిన్ విద్యుత్ నెట్‌వర్క్‌ను దెబ్బతీయడం, యుద్ధానికి ప్రజల మద్దతు లేకుండా చూడడమే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నట్లుగా ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉక్రెయిన్ సహజ వాయువు సంస్థ నాఫ్టోగాజ్ సౌకర్యాలపై రష్యా తన అతిపెద్ద దాడిని ప్రారంభించిందని.. ఈ దాడులు సైనిక ప్రయోజనాల కోసం కాదని నాఫ్టోగాజ్ సీఈవో సెర్హి కోరెట్స్కీ తెలిపారు. ఉక్రెయిన్ ప్రధాన మంత్రి యులియా స్విరిడెంకో ఈ దాడులపై రష్యా పౌరులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఈ దాడులు కైవ్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా రష్యా చెబుతోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు రష్యా మరో 109 డ్రోన్లు, మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఆ డ్రోన్లలో 73 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రేయిన్ సైన్యం తెలిపింది. ఫిబ్రవరి 2022లో రష్యా దాడి తర్వాత, రష్యా శీతాకాలంలో ఉక్రెయిన్ విద్యుత్ నెట్‌వర్క్‌పై దాడులు చేయడం గమనార్హం. శీతాకాలంలో ప్రజలకు విద్యుత్, నీరు అందకుండా చేయడమే లక్ష్యమని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. ఉక్రెయిన్ విద్యుత్ నెట్‌వర్క్‌తో పాటు సైనిక రవాణాకు కీలకమైన దాని రైల్వే నెట్‌వర్క్‌పై రష్యా దాడులను ముమ్మరం చేసింది.