ఢిల్లీ : యూజీసీ కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జనరల్ క్యాటగిరీ విద్యార్థులు, అగ్ర కులాల సభ్యులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌లో విద్యార్థుల నిరసనలు కొనసాగాయి. యూజీసీ నిబంధనలను నిరసిస్తూ అగ్రకులాలకు చెందిన విద్యార్థులు శిరోముండనం చేసుకున్నారు. బీహార్‌లో నిరసనకారులు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా పోస్టర్లపై నల్ల ఇంకు చల్లి తమ నిరసన తెలిపారు.
యూపీలో ఓ నిరసనకారుడు రక్తంతో ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇక నిబంధనలను వ్యతిరేకిస్తూ బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. రాయ్‌బరేలీలో బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేశారు. కాగా, ఈ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ధర్మాసనం బుధవారం ప్రాథమిక వాదనలు ఆలకించింది.