న్యూఢిల్లీ : ర్యాగింగ్ నిరోధక నిబంధనలు అమలుజేయటం లేదంటూ దేశవ్యాప్తంగా 18 మెడికల్ కాలేజీలకు యూజీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి నుంచి రెండేసి, ఏపీ, బీహార్ నుంచి మూడు చొప్పున, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఒక్కో వైద్య కాలేజీకి నోటీసులు జారీ అయ్యాయి. జాబితాలో తెలంగాణ నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఏపీ నుంచి ఆంధ్రా మెడికల్ కాలేజ్ (విశాఖ), గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్ ఉన్నాయి. ర్యాగింగ్ కట్టడికి యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్స్-2009 నిర్దేశించిన నిబంధనలను ఈ కాలేజీలు అమలుచేయలేదని యూజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులపై వారంలోగా వివరణ ఇవ్వాలని, లోపాలను సరిదిద్దేందుకు తీసుకునే చర్యలను వివరించాలని ఆయా విద్యాసంస్థలను ఆదేశించింది.