చెన్నై, మే 24: కొన్ని దశాబ్దాలుగా తమ కూటమిలో భాగస్వామిగా ఉంటూ వెన్నుపోటు పొడిచి అధికార పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తమిళనాడు డీఎంకే యూత్ విభాగం చీఫ్ ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం జరిగిన పార్టీ యూత్ వింగ్ సమావేశంలో ‘కాంగ్రెస్‌ను మళ్లీ ఎప్పుడూ నమ్మొద్దు’ అని తన పార్టీ క్యాడర్‌కు ఉద్బోధించిన ఆయన.. డీఎంకేకు ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ‘20 ఏండ్లకు పైగా కాంగ్రెస్ మా భుజాలపై ఎక్కి స్వారీ చేసింది. ఇప్పుడు వారు మా వెన్నులో పొడిచారు. దీనిని ఎవరూ ఎన్నటికీ మరచిపోరు. భవిష్యత్తులో కాంగ్రెస్‌ను మేం ఎన్నటికీ నమ్మం, తిరిగి మా దగ్గరకు రానీయం’ అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.
జాతీయు స్థాయిలో బీజేపీ సాధిస్తున్న విజయాలకు ఆ పార్టీ నాయకత్వ గొప్పదనమే హేతువు కాదని, దానికి కాంగ్రెస్ చేతకానితనమే ప్రధాన కారణమని స్టాలిన్ అన్నారు. ఎన్నికల్లో బీజేపీకి నిరంతర విజయాలు దక్కడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలే కారణమని తాను ఇంతకుముందు భావించానని, కానీ అది వాస్తవం కాదని, వారి విజయానికి కాంగ్రెస్ నిరంతర వైఫల్యాలే కారణమని అన్నారు. ఆ విషయం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి, లౌకిక పరిరక్షణకు, రాష్ట్రంలో బీజేపీకి స్థానం కల్పించకుండా ఉంచడానికి డీఎంకే కార్యకర్తలు, నేతలు నిరంతరం రక్తం, స్వేదం చిందించారని తెలిపారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు ఏమాత్రం ఉనికి లేకపోయినా ఆ పార్టీ ఐదు సీట్లు గెల్చుకుందంటే అదంతా డీఎంకే భిక్షేనని అన్నారు. అయితే ఎన్నికలైన వెంటనే అధికారం కోసం వారు పరుగులు తీసి అధికార టీవీకేతో చేతులు కలిపారని, తమను గెలిపించిన డీఎంకేకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేని విశ్వాసం లేనిపార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. కనీస కృతజ్ఞత, రాజకీయ మర్యాద తెలియని కాంగ్రెస్‌కు డీఎంకే గుణపాఠం చెప్పకపోయినా, త్వరలోనే ప్రజలు ఆ పని చేస్తారని అన్నారు.