ముంబై : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాబోతుండటం పట్ల తమకు సంతోషంగా ఉందని ఠాక్రే పేర్కొన్నారు. శివసేన ఎంపీలు ద్రౌపది ముర్ముకు మద్దతు తెలపాలని తనపై ఒత్తిడి తీసుకురాలేదని, కేవలం సూచనలు చేశారని చెప్పారు.
వారి సూచనలకు అనుగుణంగా తాము రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన 18 మంది శివసేన ఎంపీలకు గాను 14 మంది ఎంపీలు మంగళవారం నాటి కీలక భేటీకి హాజరు కాగా వీరిలో మెజారిటీ ఎంపీలు ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించారు.
ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మాత్రం యశ్వంత్ సిన్హా వైపు మొగ్గుచూపారని సమాచారం. ఆదివాసీ మూలాలున్న ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని ఈ సమావేశానికి హాజరైన గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వాన్ని కోరినట్టు తెలిసింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా జులై 21న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.