Sanjay Raut : శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) (Shiv Sena (UBT)) అధినేత ఉద్ధవ్ థాకరేను ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. ఈ ఏడాది ఆఖరులో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి తరఫున సీఎం అభ్యర్థిని ముందుగానే ఖరారు చేయాలని ఉద్ధవ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఇండియా కూటమి గెలిస్తే ఉద్ధవ్ థాకరే సీఎం కాబోతున్నారా..? అని సంజయ్ రౌత్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు ఆయన స్పందిస్తూ.. తానే సీఎంను అవుతానని తనంతట తానే ముందుకు రావాల్సిన అవసరం ఉద్ధవ్ థాకరేకు లేదని రౌత్ చెప్పారు. 2019లో కూడా ఉద్ధవ్ థాకరే తాను సీఎంను అవుతానని చెప్పలేదని ఆయన గుర్తు చేశారు.
కూటమి పార్టీలకు చెందిన అందరూ కలిసే ఉద్ధవ్‌ను సీఎంగా ఎన్నుకున్నారని సంజయ్ రౌత్ చెప్పారు. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చాయని, ఉద్ధవ్ థాకరే ఎప్పుడూ తాను సీఎంను అవుతానని చెప్పలేదని అన్నారు. కావాలంటే శుక్రవారం నాటి థాకరే స్పీచ్‌ను వినవచ్చని చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి ఎవరైనా సీఎం అభ్యర్థులు ఉంటే ముందుకు రావాలని అన్నారు. ఎవరు ముందుకొచ్చినా మద్దతిచ్చేందుకు ఉద్ధవ్ థాకరే సిద్ధంగా ఉన్నారని చెప్పారు.