ముంబై: మరి కొన్ని నెలల్లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు 23 సీట్లు కావాలని ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) నేతృత్వంలోని శివసేన (యూబీటీ) డిమాండ్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది. మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన (యూబీటీ) నేతలు సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం గురించి చర్చించారు. అయితే మహారాష్ట్రలోని మొత్తం 48 పార్లమెంట్ స్థానాలకు గాను 23 స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన (యూబీటీ) నేతలు ప్రతిపాదించారు. తమకు 23 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కాగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. శివసేనలోని మెజారిటీ సభ్యులు సీఎం ఏక్నాథ్ షిండే వర్గం వైపు ఉన్నట్లు కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ తెలిపారు. దీంతో ఆ పార్టీ విభజన కారణంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి తగినంత అభ్యర్థులు లేకపోవడంతో పాటు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అలాగే శరద్ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీలో కూడా చీలికలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కేవలం కాంగ్రెస్ పార్టీకే స్థిరమైన ఓటు షేరింగ్ ఉందని స్పష్టం చేశారు.