UBT -MNS | శివసేన ఉద్ధవ్ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే బుధవారం తన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేను కలిశారు. రెండు పార్టీల మధ్య పొత్తులపై చర్చల మధ్య దాదర్ ప్రాంతంలోని రాజ్ థాకరే నివాసం ‘శివ్తీర్థ్’లో సమావేశమయ్యారు. గత పక్షం రోజుల్లో థాకరే బ్రదర్స్ భేటీ కావడం ఇది రెండోసారి. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. మరాఠీ మెజారిటీగా ఉన్న మహారాష్ట్రలో పాఠశాలల్లో పిల్లలందరికీ హిందీని విధిగా బోధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం ఆదేశాలు వివాదాస్పదం కావడంతో ఆ తర్వాత.. ఫడ్నవీస్ సర్కారు ఆ దేశాలను వెనక్కి తీసుకుంది. ఇదిలా ఉండగా.. 2005లో రాజ్ థాకరే శివసేన పార్టీని వీడారు. పార్టీ వీడడానికి ఉద్ధవ్ కారణమని విమర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. దాంతో ఇద్దరు సోదరులు మళ్లీ కలిసిపోయారు. త్వరలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్తో సహా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూటమిగా పోటీ చేయాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. అదే జరిగితే రెండు పార్టీలకు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారనున్నది. కూటమి చర్చల మధ్య గత నెలలో జరిగిన బెస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఎన్నికల్లో శివసేన (UBT), ఎంఎన్ఎస్ ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ రెండు పార్టీల మద్దతు ఉన్న ప్యానెల్ మొత్తం 21 స్థానాలను కోల్పోయింది.
శివసేన (UBT) చీఫ్, ఎంఎన్ఎస్ చీఫ్ మధ్య ఇటీవల జరిగిన సమావేశంపై.. బీజేపీ ముంబయి యూనిట్ చీఫ్, ఎంఎల్ఏ అమీత్ సతం మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల మధ్య కుటుంబ సమావేశాల కంటే ప్రజల దృష్టి అభివృద్ధి సమస్యలపైనే ఉందని ఉన్నారు. ఎవరు ఎవరిని కలుస్తున్నారు.. వారి కుటుంబ సంబంధాలు ఏంటనేది ముఖ్యం కాదన్నారు. కానీ, వర్లి, పరిసర ప్రాంతాల్లో అటల్ సేతు, కోస్టల్ రోడ్, బీడీడీ చావల్స్ను ఎవరు అభివృద్ధి చేశారు.. ముంబయి అంతటా భారీ సీసీటీవీ కెమెరాల నెట్వర్క్ను ఎవరు ఏర్పాటు చేశారు అనేదే ముఖ్యమన్నారు. ఇవే ప్రధాన సమస్యలని.. ముంబైకర్లు దీని ఆధారంగా ఓటు వేస్తారని అమీత్ పేర్కొన్నారు.