Udayanidhi Stalin | చెన్నై, ఫిబ్రవరి 19: కేంద్ర బడ్జెట్లో తమిళనాడుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, రాష్ట్రం పేరే బడ్జెట్లో లేదని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. తామేమీ వాళ్ల(కేంద్రం) తండ్రి సొమ్ము అడగడం లేదని, తమ హక్కులనే అడుగుతున్నామని వ్యాఖ్యానించారు. జాతీయ విద్యా విధానం 2020లోని త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా మంగళవారం చెన్నైలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
త్రిభాషా విధానాన్ని, హిందీ భాషను అంగీకరించకపోతే తమకు సమగ్ర శిక్షా మిషన్ కింద రావాల్సిన రూ.2,190 కోట్లను ఇవ్వబోమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్తున్నారని ఉదయనిధి ఆరోపించారు. ఇవి తమిళనాడు ప్రజలు కట్టిన పన్నుల డబ్బులని, తమకు హక్కుగా రావాల్సిన నిధులని పేర్కొన్నారు. ‘ఇది ద్రవిడ నేల, పెరియార్ భూమి. బీజేపీ హెచ్చరికలు తమిళనాడులో పనిచేయవు. మేము హిందీని అంగీకరించాలని వాళ్లు(బీజేపీ) మొండిగా వ్యవహరిస్తున్నారు. తమిళులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాలనుకుంటున్నారు. మా హక్కులను వాళ్లు గౌరవించకపోతే మరో భాషా యుద్ధాన్ని చేపట్టడానికి వెనుకాడబోం’ అని హెచ్చరించారు.