UCC | న్యూఢిల్లీ, జూన్ 30: వైఫల్యాలను కప్పిపుచ్చుకొని, ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నాలను బీజేపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూసీసీ (UCC) బిల్లు తెచ్చేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగా యూసీసీపై చర్చించేందుకు ఈనెల 3న లా కమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ కానున్నట్టు న్యాయ కమిటీ చైర్మన్ సుశీల్ మోదీ తెలిపారు. ఈ సమావేశంలో యూసీసీపై లా కమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధుల అభిప్రాయాలను స్టాండింగ్ కమిటీ తెలుసుకోనున్నది. ప్రజా ఫిర్యాదులు, అభ్యంతరాలు, చట్టం తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు సమాచారం. యూసీసీపై తమ అభిప్రాయాలను తెలపాలంటూ లా కమిషన్ జూన్ 14న పబ్లిక్ నోటీసును జారీ చేసింది. దీనిపై ఇప్పటివరకు సుమారు 8.5 లక్షల ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తున్నది.
సిద్ధమైన ఉత్తరాఖండ్ ముసాయిదా
యూసీసీపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తమ నివేదిక ముసాయిదా సిద్ధమైందని వెల్లడించింది. ముసాయిదా ప్రతులను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని కమిటీ చీఫ్, జస్టిస్ రంజనా దేశాయ్ శుక్రవారం తెలిపారు. గతేడాది మేలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రతిపక్షాల విమర్శలు…
యూసీసీని చట్టరూపంలోకి తెచ్చేందుకు తహతహలాడుతున్న బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్ అల్లర్లు తదితర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే యూసీసీని తెరపైకి తీసుకొస్తున్నట్టు ఆరోపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రంలోని బీజేపీ యూసీసీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని సమాజ్వాదీ పార్టీ జాతీయ జనరల్ సెక్రెటరీ శివపాల్ సింగ్ యాదవ్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో శుక్రవారం మాట్లాడుతూ ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం తదితర అంశాలపై మోదీ ప్రభుత్వానికి ఆందోళన లేదని పేర్కొన్నారు.
షిండే వర్గం మద్దతు…
యూసీసీకి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మద్దతు తెలిపింది. బాలాసాహెబ్ ఠాక్రే విజన్ ‘ఒకే దేశం, ఒకే చట్టం’ను అనుసరించి యూసీసీకి మద్దతు తెలుపుతామని ఆ పార్టీ వెల్లడించింది. షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆ పార్టీ ఎంపీ రాహుల్ షెవాలే వెల్లడించారు.
యూసీసీని వ్యతిరేకించిన బీజేపీ మిత్రపక్షం
యూసీసీపై దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయలో దాని మిత్రపక్షంగా ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) యూసీసీని తీవ్రంగా వ్యతిరేకించింది. మేఘాలయ సీఎం, ఎన్పీపీ అధినేత కొన్రాడ్ కే సంగ్మా యూసీసీపై బీజేపీ తీరును తప్పుబట్టారు. వైవిధ్యమే భారతదేశ బలం, గుర్తింపు.. దేశ ఆలోచనలకు వ్యతిరేకంగా యూసీసీ ఉన్నదని సంగ్మా విమర్శించారు. షిల్లాంగ్లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈశాన్య భారత్కు ప్రత్యేకమైన సంస్కృతి ఉన్నదని, దాన్ని అలాగే ఉంచాలని ఆయన కోరారు. యూసీసీ ముసాయిదాను చూడకుండా దానిపై ముందుకు వెళ్లలేమని వ్యాఖ్యానించారు.