Bihar | సోషల్ మీడియాలో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు తరచూ మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన జంట కూడా ఇలాగే పెళ్లి చేసుకుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వివాహం చేసుకుంది అబ్బాయి.. అమ్మాయి కాదు.. ఇద్దరూ అమ్మాయిలే. బిహార్‌లోని సుపాల్ జిల్లాలో జరిగిన ఈ వింత మ్యారేజ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. సుపాల్ జిల్లాకు చెందిన పూజా గుప్తా (21), కాజల్ కుమారి (18) అనే యువతులకు రెండేళ్ల క్రితం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాటింగ్, ఫోన్ కాల్స్‌తో వీరి పరిచయం స్నేహంగా, అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. దీంతో సుపాల్ పట్టణంలోని త్రివేణిగంజ్‌లో ఉన్న ఓ మాల్లో ఇద్దరూ పనికి చేరారు. ఆ మాల్‌కు దగ్గరలోనే ఇద్దరూ ఒక గదిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకుని జీవితాంతంత కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.
డిసెంబర్ 23వ తేదీన అర్ధరాత్రి త్రివేణిగంజ్ మేళా గ్రౌండ్‌లోని కాళీమాత ఆలయానికి చేరుకున్న ఇద్దరూ అక్కడే పెళ్లి చేసుకున్నారు. హోమానికి బదులు గ్యాస్ స్టవ్ చుట్టూ ఏడడుగులు వేశారు. వీరి పెళ్లికి పూజారి, బంధువులు ఇలా ఎవరూ లేరు. ఆలయంలో కొద్దిమంది మాత్రమే ఉండటంతో ఈ విషయం తొందరగా బయటకు రాలేదు.
పూజా గుప్తా వరుడి డ్రెస్ వేసుకోగా.. కాజల్ వధువు డ్రెస్ వేసుకుంది. పెళ్లితంతులో భాగంగా కాజల్ నుదుటిన పూజా గుప్తా తిలకం దిద్దింది. అనంతరం ఇద్దరూ దండలు మార్చుకుని, గ్యాస్ స్టవ్ చుట్టూ ఏడడుగులు వేశారు. వివాహం అనంతరం బుధవారం ఉదయం వీరిద్దరూ తమ గదికి చేరుకోవడంతో.. ఈ పెళ్లి వార్త వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు బయటకొచ్చాయి.
ఈ సందర్భంగా వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. తమకు అబ్బాయిలపై ఆసక్తి లేదని తెలిపారు. ఇద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. చనిపోయే వరకు ఇద్దరం కలిసే ఉంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు వీరి పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.