ముంబై: శివసేన కార్పొరేటర్ దాడి చేయడంపై ఇద్దరు డాక్టర్లు తీవ్ర భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఆ హాస్పిటల్‌కు రాజీనామా చేశారు. ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయారు. (Two Thane doctors resign) చాలా భయంగా ఉండటంతో తాను రాజీనామా చేసినట్లు మహారాష్ట్ర థానే జిల్లాలోని డోంబివ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసిన ఒక డాక్టర్ వాపోయారు. ‘గూండాలు మమ్మల్ని గమనిస్తున్నారు. అందుకే నేను నగరం విడిచి వచ్చేశాను. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఇతర వైద్యులు అక్కడ పని కొనసాగించవచ్చు, కానీ నేను కొనసాగించలేను. నేను మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళను’ అని ఆ డాక్టర్ తెలిపారు.
కాగా, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న డాక్టర్ వైభవ్ సాలుంఖే, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సృష్టి బావిస్కార్ తమ రాజీనామాలను ఆ సంస్థకు సమర్పించినట్లు కేడీఎంసీ వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ దీపా శుక్లా తెలిపారు. ఆ రాజీనామా పత్రాలు ఇంకా తమకు అందలేదని అన్నారు.
మరోవైపు జూలై 6న సాయంత్రం వేళ డోంబివ్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన ఒక శిశివు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరో ఆసుపత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. ఆ శిశువు కుటుంబ సభ్యులు స్థానిక శివసేన కార్పొరేటర్ రాకేష్ మహాత్రేకు ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన ఆయన అక్కడ హంగామా చేశారు. వైద్యురాలిని కొట్టడంతోపాటు ఒక వైద్యుడు, వైద్య సిబ్బందిపై చేయి చేసుకున్నారు.
అయితే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు స్పందించారు. శివసేన కార్పొరేటర్ రాకేష్ మహాత్రే, అతడి అనుచరులపై కేసు నమోదు చేశారు. కార్పొరేటర్‌ను బుధవారం రాత్రి అరెస్టు చేయగా, ముగ్గురు అనుచరులను ఒక రోజు ముందే అదుపులోకి తీసుకున్నారు. అయితే అనారోగ్యం దృష్ట్యా శివసేన కార్పొరేటర్ రాకేష్ మహాత్రేను థానే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.