న్యూఢిల్లీ: పిల్లలపై సినిమాల ప్రభావం బాగానే పడుతుందనడానికి నిదర్శనంగా మరో ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఖద్ద కాలనీలో పిల్లలు గిల్లి-దండ ఆటలో పెట్టుకున్న గొడవ చివరికి కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటనలో కత్తిపోట్లకు గురైన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితులు ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కలింది కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖద్ద కాలనీకి చెందిన రిశు తివారీ (16), సకీబ్ అలీముద్దీన్ (19) ఇద్దరూ కాలనీలోని ఇతర పిల్లలతో కలిసి ఈ నెల 1న ‘గిల్లి దండ’ ఆట ఆడారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో అక్కడున్న పెద్దవాళ్లు కల్పించుకుని ఇద్దరికీ సర్దిచెప్పి గొడవను సద్దుమణిచారు.
కానీ అది మనసులో పెట్టుకున్న సకీబ్ అలీముద్దీన్ రిశు తివారీ ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా ఎదురుచూశాడు. ఈ క్రమంలో ఈ నెల 13న (మంగళవారం) రిశు ఒంటరిగా కనిపించాడు. దాంతో సఖీబ్ తన స్నేహితులు ఆనస్ ఫక్రుద్దీన్ (19), మరో మైనర్ బాలుడితో కలిసి రిశుపై కత్తులతో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆనంద్ మాథుర్ (19)ని కూడా కత్తులతో పొడిచి పారిపోయారు.
దాంతో స్థానికులు గాయపడిన ఇద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితుల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలించి నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఇద్దరికీ ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నది.