చండీగఢ్: పంజాబ్‌కు చెందిన ఇద్దరు రైతులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా కొనసాగిన నిరసనకు ముగింపు పలకడంతో రైతులు తమ ఇండ్లకు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన కొందరు రైతులు ఢిల్లీలోని టిక్రీ నిరసన ప్రాంతం నుంచి ట్రాక్టర్-టైలర్లో తమ రాష్ట్రానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే హర్యానాలోని హిసార్‌కు చేరగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైతులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు ఢిల్లీ సరిహద్దు నిరసన ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో తమ ఇండ్లకు బయలుదేరుతున్నారు. దీంతో సింఘూ ప్రాంతంతోపాటు ఇతర చోట్ల ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతున్నది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించారు. నిరసనను ముగించిన రైతులు తమ ఇండ్లకు వెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.