Haridwar | డెహ్రాడూన్: రామ్‌లీలా నాటకంలో భాగంగా వానరులుగా నటించిన ఇద్దరు ఖైదీలు నిచ్చెన సాయంతో గోడ దూకి జైలు నుంచి పరారయ్యారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిందీ ఘటన. విజయదశమిని పురస్కరించుకుని హరిద్వార్ జైలులో కొందరు ఖైదీలు శనివారం రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించారు. నాటకంలో కొందరు ఖైదీలు వానర వేషాలు ధరించారు.
నాటకం రసవత్తరంగా సాగుతుండడం, జైలు అధికారులు, సిబ్బంది, గార్డులంతా నాటకం చూడడంలో మునిగిపోవడంతో ఇదే అదునుగా భావించిన వానర వేషంలో ఉన్న ఇద్దరు ఖైదీలు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుని నిచ్చెన ద్వారా గోడ దూకి పరారయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు జైలు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.