బీజాపూర్: వరుసగా అగ్రనేతలను కోల్పోతున్న మావోయిస్టులకు (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భద్రతా బలగాలు కనిపించినవారిని కనిపించినట్లు చంపేస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత నాయుడు సుధాకర్ మరణించిన 24 గంటల వ్యవధిలోనే మరో కీలక నేత మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ శుక్రవారం చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఛతీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో (Bijapur Encounter) మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర కమాండర్లు మృతిచెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.
భద్రతాబలగాలు బీజాపూర్ నేషనల్పార్కులు గత మూడు రోజులుగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మరణించారు. గురు, శుక్రవారాల్లో జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్, భాస్కర్ మరణించారు. భాస్కర్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించగా, సుధాకర్‌ఫై రూ.40 లక్ష రివార్డు ఉన్నది.