న్యూఢిల్లీ, మే 16: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ఇద్దరి పేర్లను కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, సీనియర్ అడ్వకేట్ కేవీ విశ్వనాథన్ ఉన్నారు. ఈ మేరకు మంగళవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసింది. కేవీ విశ్వనాథన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 32 మంది జడ్జీలున్నారు. జూలై రెండో వారంలో మరో నలుగురు జడ్జిలు పదవీ విరమణ చేయనున్నారు. విశ్వనాథన్ పేరు ఆమోదం పొందితే 2030, ఆగస్టు 11న జస్టిస్ పార్థివాలా పదవీ విరమణ తర్వాత విశ్వనాథన్ సీజేఐ అయ్యే అవకాశం ఉన్నది. అదే జరిగితే ఆయన 2031, మే 25 వరకు ఆ పదవిలో ఉంటారు. అదేవిధంగా సుప్రీంకోర్టు బార్ నుంచి న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన పదో అడ్వకేట్, సీజేఐ అయిన నాలుగో న్యాయవాది అవుతారు.