కొత్తగూడెం ప్రగతి మైదాన్, 20 జూన్: చత్తీస్గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలో భద్రతా దళాలు – మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. చత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా చోటే భేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు బీఎస్ఎఫ్ – డిఆర్జి భద్రతా దళాలు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఆమతోల – కల్పార్ గ్రామాల మధ్య ఉన్న కొండ ప్రాంతాల్లో శుక్రవారం మావోయిస్టులు తారాసపడి భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.
ఇరు వర్గాల మధ్య సుమారు 30 నిమిషాల పైనే ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలో పారిపోయారు. కాల్పుల విరమణ అనంతరం భద్రతా దళాలు సంఘటన స్థలం నుంచి ఓ మహిళా మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనపరచుకున్నారు. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో మావోయిస్టు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.