న్యూఢిల్లీ, జూలై 31: హర్యానాలోని గురుగ్రామ్‌కు సమీపంలో విశ్వహిందు పరిషత్ (వీహెచ్‌పీ) చేపట్టిన మత ఊరేగింపు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సోమవారం నుహ్ వద్ద వీహెచ్‌పీ చేపట్టిన ‘బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర’ నేపథ్యంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రెండు వర్గాల వారు పరస్పరం రాళ్లదాడికి దిగారు. పెద్ద సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు హోంగార్డులు మృతి చెందారని, డీఎస్పీ సజ్జన్ సింగ్ తలకు గాయమైందని, ఓ ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డాడని స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
గురుగ్రామ్-ఆల్వార్ జాతీయ రహదారిపై మత ఊరేగింపును కొంతమంది అడ్డుకోవటంతో హింస చెలరేగిందని తెలిపారు. ఈ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరు వర్గాల వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. బుధవారం వరకు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తూ హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఘర్షణలు చెలరేగటంతో యాత్రలో పాల్గొన్న 2500 మంది భయాందోళనతో సమీపంలోని నుల్హార్ మహదేవ్ ఆలయంలో తలదాచుకున్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన ఓ వీడియో తాజా ఘటనకు కారణమని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Fire