న్యూఢిల్లీ, జూన్ 12: రష్యా సైన్యం నియమించుకొన్న మరో ఇద్దరు భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇటీవల మరణించారని భారత విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో ఈ యుద్ధంలో మరణించిన భారతీయుల సంఖ్య నాలుగుకు చేరిందని తెలిపింది. ఈ తీవ్రమైన అంశాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఆ దేశం తన సైన్యంలో నియమించుకొన్న భారతీయులందరినీ వెనక్కు పంపాలని కోరామని తెలిపింది.
భారతీయులను ఇకపై సైన్యంలో నియమించుకోవడం ఆపాలని డిమాండ్ చేశామని పేర్కొన్నది. రష్యా సైన్యానికి సెక్యూరిటీ హెల్పర్లుగా నియమించుకొన్న పలువురు భారతీయులను యుద్ధంలోకి దింపడంతో.. కొందరు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు త్వరలో దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగనుండగా.. రష్యా దళాలు బుధవారం ఉక్రెయిన్లోని కీవ్ రీజియన్పైకి క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. వాటన్నింటినీ కూల్చివేశామని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.