న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు .. ఇద్దరు వ్యోమగాములను(Indian Astronauts) ఇస్రో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరు పైలెట్లు అమెరికా చేరుకున్నారు. హూస్టన్‌లో ఉన్న ప్రైవేటు కంపెనీ ఆక్సియమ్ స్పేస్‌లో వాళ్లు శిక్షణ మొదలుపెట్టారు. గ్రూప్ కెప్టన్ శుభాన్షు శుక్లాతో పాటు గ్రూప్ కెప్టెణ్ ప్రశాంత బాలకృష్ణన్ నాయర్ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ ఇద్దరూ గగన్‌యాన్ మిషన్‌లో ఉన్నారు. ఆక్సియమ్ స్పేస్, నాసా కెన్నడీ స్పేస్ సెంటర్, స్పేస్ ఎక్స్‌లో శిక్షణ పొందుతారు. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా .. ప్రైమరీ ఆస్ట్రోనాట్ కాగా, స్పేస్ స్టేషన్ మిషన్ కు గ్రూప్ కెప్టెన్ నాయర్ బ్యాకప్ ఆస్ట్రోనాట్‌గా ఉండనున్నారు.
ఆక్సియమ్-4 పేరుతో మిషన్ చేపడుతన్నారు. కొన్ని నెలల పాటు ఆ ఇద్దరికీ శిక్షణ ఉంటుందని ఆక్సియమ్ స్పేస్ ఒక ప్రకటనలో తెలిపింది. 2025లో స్పేస్ స్టేషన్‌కు ఎగిరే అవకాశం వస్తుంది. స్పేస్ స్టేషన్లో ఆ వ్యోమగాములు సుమారు 14 రోజులు గడపనున్నారు. శుభాన్షు శుక్లాతో పాటు అమెరికా ఆస్ట్రోనాట్ కమాండర్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టు స్లావోజ్ ఉనస్కీ, మరో స్పెషలిస్టు టిబర్ కాపు శిక్షణ పొందుతున్నారు. స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఫ్లోరిడా నుంచి పంపనున్నారు.