న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు జన జీవనాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సామాన్య ప్రజలకు తాగునీరు కరువైంది. అమర్నాథ్ యాత్రను ముందు జాగ్రత్త చర్యగా శనివారం తాత్కాలికంగా నిలిపేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
హైదరాబాద్ నుంచి వెళ్లిన భక్తులు నిర్మల్ షాహీ (36), సత్యనారాయణ (50) ఉత్తరాఖండ్లోప్రాణాలు కోల్పోయారు. బదరీనాథ్ జాతీయ రహదారిపై గౌషర్-కర్ణ ప్రయాగ్ మధ్య ఛట్వపీపల్ సమీపంలో జరిగిన ప్రమాదంలో వీరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ బదరీనాథ్ దేవాలయం నుంచి ద్విచక్ర వాహనం తిరిగి వస్తున్న సమయంలో కొండ చరియ విరిగిపడిందన్నారు. దానిలోని పెద్ద బండరాళ్లు వీరిని ఢీ కొట్టడంతో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
జమ్మూ-కశ్మీరులో శుక్రవారం రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తుండటంతో అమర్నాథ్ యాత్రకు శనివారం తాత్కాలిక విరామం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అమరలింగేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు ప్రయాణించే బల్తల్, పహల్గామ్ మార్గాల్లో రాకపోకలను నిలిపేసినట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో 214.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అస్సాంలోని 30 జిల్లాలు జల ప్రళయంతో విలవిలలాడుతున్నా యి.కజిరంగా నేషనల్ పార్కులో 115 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. మరోవైపు వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్లో 13 మంది మృతి చెందారు. బీహార్లో అనేక నదులు ప్రమాదకర స్థాయికి దగ్గరగా ప్రవహిస్తున్నాయి.