10 కిలోమీటర్లు కాదు.. 100 కిలోమీటర్లు కాదు.. ఏకంగా 4 వేల కిలోమీటర్లు.. అది కూడా నడుచుకుంటూ ప్రయాణం. అసలు.. 4 వేల కిలోమీటర్ల నడక అనేది సాధ్యమేనా. దాన్ని మేము సుసాధ్యం చేస్తామంటున్నారు ఇద్దరు ఇంజనీర్లు అక్షయ్, గుర్కిరాత్. ఇద్దరూ ట్రెక్కర్సే.
ఇద్దరికీ ట్రెక్కింగ్ చేసే సమయంలోనే పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ సాహసం చేయడమంటే చాలా ఇష్టం. అదే ఇష్టం ఇప్పుడు వాళ్లి ఇద్దరినీ మరో సాహసానికి ఒడికట్టేలా చేసింది. అందుకే నాగాలాండ్ నుంచి కన్యాకుమారి వరకు 4000 కిమీల నడక ప్రయాణానికి నాంది పలికింది.
ఇప్పటికే వాళ్ల సాహస యాత్ర ప్రారంభం అయింది. నాగాలాండ్ నుంచి వాళ్ల కాలినడక ప్రయాణం ప్రారంభం అయి 117 రోజులు అయింది. ప్రస్తుతం వాళ్లు కర్ణాటకలో ఉన్నారు. త్వరలోనే కన్యాకుమారికి రీచ్ కాబోతున్నారు.
ఇలా వేల కిలోమీటర్ల కాలినడక యాత్రను ఎందుకు వీళ్లు చేపట్టారంటే.. యాక్టివ్ లైఫ్ స్టయిల్‌ను ప్రమోట్ చేయడం కోసం, కాలినడకను వెళ్లే వాళ్లకు కావాల్సిన మౌలిక వసతుల గురించి అందరికీ తెలియజెప్పడం కోసం.
ప్రతి ఒక్కరి దగ్గర ప్రయాణం కోసం వాహనాలు ఉండవు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈనేపథ్యంలో కాలినడక వెళ్లే వాళ్లకు ఎలాంటి మౌలిక వసతులు అందుతున్నాయి.. అసలు రోడ్లు నడవడానికి అనుకూలంగా ఉన్నాయా లేదా తెలుసుకొని.. వాటిపై అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ యాత్రను చేపట్టినట్టు ఇన్‌స్టాలో ఇంజనీర్లు తెలిపారు. రోజుకు కనీసం 40 కిలోమీటర్లు నడుస్తూ.. చీకటి పడగానే.. అక్కడే టెంట్ వేసుకొని రాత్రి నిద్రపోయి.. ఉదయం కాగానే మళ్లీ నడక ప్రారంభిస్తారు.
వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో అయితే కనీసం మంచినీళ్లు కూడా దొరకలేదట. కొన్ని రోజులు అయితే రోజుకు ఒక సమోసా, చాయ్ తాగి నడక కొనసాగించారట. ఇలా.. ఎన్నో కష్టాలు, కన్నీళ్లను దిగమింగుకొని 117 రోజుల యాత్రను ఇప్పటి వరకు విజయవంతంగా ముగించారు. మరికొన్ని రోజుల్లో కన్యాకుమారికి చేరుకొని పూర్తిస్థాయిలో యాత్రను ముగించేయనున్నారు.