Uttar Pradesh | కన్నౌజ్ : నిర్మాణంలో ఉన్న కట్టడాలు కూలడం కార్మికుల బతుకులకు శాపంగా మారుతున్నది. ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్ వద్ద శనివారం నిర్మాణంలో ఉన్న రూఫ్ స్లాబ్ కూలిపోవడంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిలో 12 మందిని సహాయక సిబ్బంది రక్షించినట్టు అధికారులు తెలిపారు. ఇంకా 23 మంది వరకు శిథిలాల కిందే ఉన్నట్టు వారు చెప్పారు. ఈ ఘటనలో అయిదుగురు గాయపడ్డారు. పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. సంఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఘటనా స్థలికి చేరుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
రాయ్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సెంట్రింగ్ ఫ్రేమ్‌లు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, 6 మంది కార్మికులు గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం వీఐపీ రోడ్‌లోని విశాల్ నగర్లో కడుతున్న బహుళ అంతస్థుల భవనం వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, భవనంలో 7-10 అంతస్థుల పైకప్పుల (స్లాబ్) నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ ఫ్రేమ్‌లు, కర్రలు, ఇనుప కడ్డీలు.. ఒక్కసారిగా కుప్పకూలాయి. వీటి కింద చిక్కుకున్న 10 మందికిపైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లను దగ్గర్లో ఉన్న వివిధ దవాఖానలకు తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో ఒక కార్మికుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.