న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 : పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో గతంలో ఎన్నడూ లేని రీతిలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. పీవోకేవ్యాప్తంగా సోమవారం ఆవామీ యాక్షన్ కమిటీ(ఏఏసీ) అధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. షటర్ డౌన్, వీల్ జామ్ సమ్మె పేరిట భారీస్థాయిలో నిరవధిక ఆందోళనలకు ఏఏసీ పిలుపునివ్వగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తూ షరీఫ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. జన సేకరణను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. పీవోకే పట్ల రాజకీయ వివక్ష, ఆర్థిక నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వేలాదిమంది నిరసనకారులతో పౌర సమాజానికి చెందిన ఏఏసీ సోమవారం ప్రదర్శన నిర్వహించింది. పాక్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం పీవోకే అసెంబ్లీలో కేటాయించిన 12 సీట్లను రద్దు చేయడంతోసహా వ్యవస్థాగత సంస్కరణలు కోరుతూ 38 డిమాండ్లను ఏఏసీ ప్రభుత్వం ముందు ఉంచింది. సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, విద్యుత్తు చార్జీల తగ్గింపు, ప్రభుత్వం గతంలో ఇచ్చిన వాగ్దానాల అమలు వంటివి ఏఏసీ డిమాండ్లలో ఉన్నాయి.
తాము వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించడం లేదని, గడచిన 70 ఏళ్లుగా తమ ప్రజలకు దక్కని ప్రాథమిక హక్కుల అమలు కోసమే తమ ఆందోళన అని ఏఏసీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ సోమవారం ముజఫరాబాద్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన అన్యాయం ఇక చాలని, హక్కులను కల్పిస్తారా లేక ప్రజాగ్రహాన్ని చవిచూస్తారా అన్నది ప్రభుత్వమే తేల్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అయితే షరీఫ్ ప్రభుత్వం పీవోకేలో చెలరేగే ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు కనపడుతోంది. పీవోకే ప్రధాన పట్టణాలలో భారీ స్థాయిలో సాయుధ బలగాలను మోహరించింది. పంజాబ్ నుంచి వేలాదిమంది బలగాలు ముజఫరాలోకి ప్రవేశించాయి. శని, ఆదివారం నాడు ప్రధాన నగరాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేసిన ప్రభుత్వం కీలక స్థావరాల వద్ద నిఘాను పెంచింది. ఇస్లామాబాద్ నుంచి 1,000 మంది పోలీసు సిబ్బంది పీవోకేకి చెందిన పట్టణాలకు తరలివెళ్లాయి.