న్యూఢిల్లీ: పంట పొలాలు ఇక యుద్ధ భూములుగా మారనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తమ దేశంలోకి ప్రమాదకర జీవ వ్యాధికారక ఫంగస్‌ను అక్రమంగా తీసుకువచ్చిన ఇద్దరు చైనా జాతీయులను అరెస్టు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మంగళవారం ప్రకటించారు. చైనా కమ్యూనిస్టు పార్టీకి విధేయురాలైన యంగింగ్ జియాన్ యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో పరిశోధకరాలిగా పనిచేస్తోందని, తన పరిశోధన కోసం ఫసారియం గ్రమినీరం అనే ప్రమాదకర ఫంగస్‌ను ఆమె అమెరికాలోకి స్మగ్లింగ్ చేసిందని పటేల్ ఎక్స్ వేదికగా తెలిపారు.
జియాన్ స్నేహితుడు, చైనాలో ఓ యూనివర్సిటీలో పనిచేస్తున్న జున్యంగ్ లియూ ద్వారా ఆమె ఈ ఫంగస్‌ను అమెరికాలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు. జియాన్ పరిశోధనకు చైనా ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నదని ఆయన వెల్లడించారు. ఈ ఫంగస్‌ని వ్యవసాయ ఉగ్రవాదంతో పటేల్ పోల్చారు. గోధుమ, బార్లీ, మక్కజొన్న, వరి వంటి పంటలకు హెడ్ బ్రైట్ అనే ప్రమాదకర వ్యాధి ఈ ఫంగస్ ద్వారా సోకుతుందని ఆయన చెప్పారు. పంటలకు సోకే ఈ వ్యాధి వల్ల మనుషులకే కాక పశువులకు కూడా హానికరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రపంచవ్యాప్తంగా ఏటా వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం చేకూరే అవకాశం ఉందని పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్‌కు ఎంత ప్రమాదం?
వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడే దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసేందుకు శత్రు దేశాలు ఈ రకమైన వ్యవసాయ ఉగ్రవాదాన్ని ఎంచుకునే అవకాశం అధికంగా ఉన్నట్లు తాజా పరిణామం సూచిస్తున్నది. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగాలను లక్ష్యంగా చేసుకుని అత్యంత చవకగా, ఎవరూ గుర్తించలేని రీతిలో, ప్రజలు తినే ఆహారాన్ని విషంగా మార్చగల ఆయుధంగా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్ జనాభాలో 55 శాతం మంది వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అంతేగాక, ముఖ్యమైన వ్యవసాయ ఆధారిత రాష్ర్టాలైన పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ భారత్‌ను శత్రువుగా పరిగణించే పాకిస్థాన్, చైనా వంటి దేశాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి.