పట్నా: భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు చైనీయులను (Chinese nationals) పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్ మీదుగా బీహార్‌లోని (Bihar) పశ్చిమ చంపారన్ (East Champaran) జిల్లాలోకి సరైన పత్రాలు లేకుండా ఇద్దరు చైనీయులు ప్రవేశించారు. అయితే వారిని రాగ్జల్ బార్డర్ ఔట్‌పోస్ట్ (Raxaul border outpost) వద్ద పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా వారిని చైనాలోని (China) జాక్సింగ్ ప్రావిన్స్‌కు (Jaoxing province) చెందిన జావో జింగ్, ఫు కాన్‌గా గుర్తించారు. నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించామని చెప్పారు. సరిహద్దుల అవతల ఉన్న బిర్‌గంజ్‌లోని (Birganj) హోటల్లోనే పాస్‌పోర్ట్‌లను వదిలి వచ్చినట్లు అసిస్టెంట్ ఫారెనర్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎస్కే సింగ్ తెలిపారు. అక్కడి నుంచి కాలినడకన ఈస్ట్ చంపారన్ జిల్లాలోకి ప్రవేశించారని, ఈ క్రమంలో పట్టుబడ్డారని చెప్పారు.
కాగా, ఈ నెల 2న కూడా వాళ్లు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించారని వెల్లడించారు. ఈ సందర్భంగా వారి పాస్‌పోర్టులపై భారత్‌లోకి అనుమతి లేదంటూ ముద్ర వేశామని, తిరిగి వారి దేశానికి పంపించామని చెప్పారు. మళ్లీ వారు దేశంలోని అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారని, అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించామన్నారు.