HMPV | చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు భారత్‌లోనూ క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు, అహ్మదాబాద్‌లో ఒకటి, చెన్నైలో మరో రెండు కేసులు వెలుగు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్ (Nagpur)లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఏడు, 14 ఏళ్ల చిన్నారులకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్‌గా తేలింది.
జనవరి 3వ తేదీన చిన్నారులకు జ్వరం, దగ్గు రావడంతో నగరంలోని రాందాస్‌పేట్‌లో గల ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికీ హెచ్‌ఎమ్‌పీవీ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలకు ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం హెచ్‌ఎమ్‌పీవీ కేసుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ ఏడు పాజిటివ్ కేసుల్లో బాధితులంతా చిన్నారులే కావడం గమనార్హం. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
అప్రమత్తమైన రాష్ట్రాలు
హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎదురుయ్యే వైద్యపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు సోమవారం మార్గదర్శకాలను జారీ చేశాయి. బెంగళూరులో రెండు హెచ్ఎంపీవీ కేసుల నేపథ్యంలో ‘ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం’ అంటూ కర్ణాటక అడ్వైజరీ జారీ చేసింది. జనం ఎక్కువ ఉన్న చోట్ల మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించింది. హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని, దేశంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు అసాధారణంగా పెరగలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు వీడియో మెసేజ్ ద్వారా సూచించారు. కాగా, హెచ్ఎంపీవీతో పాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కొవిడ్-19 కేసులు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చైనా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది.
హెచ్ఎంపీవీ ప్రపంచమంతా ఉన్నదే: ఐసీఎంఆర్
హెచ్ఎంపీవీ ఇప్పటికే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నదని, ఈ వైరస్‌తో సంబంధమున్న శ్వాసకోశ సమస్యల కేసులు అనేక దేశాల్లో నమోదవుతున్నాయని ఐసీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ వద్ద ఉన్న ప్రస్తుత సమాచారంతో పాటు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్(ఐడీఎస్పీ) డాటా ప్రకారం చూస్తే దేశంలో ఇన్‌ప్లుయెంజా లాంటి అనారోగ్య సమస్యల(ఐఎల్ఐ) లేదా తీవ్ర శ్వాసకోస సమస్య(ఎస్ఏఆర్ఐ) కేసుల సంఖ్య అసాధారణంగా ఏమీ పెరగలేదని వెల్లడించింది. కాగా, హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదని కర్ణాటక వైద్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు పేర్కొన్నారు. బాధిత శిశువులు ఎక్కడా ప్రయాణించలేదని, కాబట్టి ఇది బయటి నుంచి వచ్చిన వైరస్ కాదని అన్నారు. చైనాలో ఉన్నది కొత్త వేరియంట్ కావొచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదేమీ కొత్త వైరస్ కాదు
ప్రతి శీతాకాలంలో ఈ కేసులు వస్తుంటాయని, నవంబర్ నుంచి తమ దవాఖానలో మూడు హెచ్ఎంపీవీ కేసులు గుర్తించామని, ఇవన్నీ తేలికపాటి వైరస్ కేసులేనని కోల్‌కతాలోని పీర్లెస్ హాస్పిటల్ సీఈవో సుదీప్త మిత్ర పేర్కొన్నారు. హెచ్ఎంపీవీ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఎయిమ్స్ ఇంటర్నల్ మెడిసిన్ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ తెలిపారు. కొవిడ్-19తో హెచ్ఎంపీవీని పోల్చవద్దని, కొవిడ్-19 అనేది పూర్తిగా కొత్త వైరస్ అని, దానిపై పోరాడగల రోగ నిరోధక శక్తి అప్పుడు ఎవరిలో లేదని అన్నారు.
హెచ్ఎంపీవీ 2001 నుంచి ఉన్నదేనని చెప్పారు. పదేండ్ల వయసు వచ్చే నాటికి చాలావరకు పిల్లల్లో హెచ్ఎంపీవీకి వ్యతిరేకంగా పోరాడే రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కాగా, హెచ్ఎంపీవీకి వ్యాక్సిన్ లేకపోయినా కొవిడ్ వ్యాక్సిన్ మూడు డోసులు లేదా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో హెచ్ఎంపీవీని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఉంటుందని బెంగళూరులోని హెచ్‌సీజీ హాస్పిటల్ ఆంకాలజిస్ట్ విశాల్ తెలిపారు.
Also Read..
“HMVP | హెచ్ఎంపీవీ కలకలం.. దేశంలో ఆరు పాజిటివ్ కేసులు”
HMPV virus | హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదు.. ఆందోళన వద్దు: కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా
HMPV | భారత్‌లోకి ప్రవేశించిన చైనా వైరస్.. హెచ్‌ఎమ్‌పీవీ లక్షణాలు ఇవే..!
HMPV | ఇప్పటికే భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ.. బాంబ్ పేల్చిన ఐసీఎంఆర్