న్యూఢిల్లీ, జూన్ 6: కేరళలో మళ్లీ నోరో వైరస్ కలకలం రేపింది. అక్కడ కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల్లో వైరస్ను గుర్తించినట్టు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని తెలిపారు. కాగా, నోరో వైరస్ కేసులపై కేంద్రం అప్రమత్తమైంది. పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. కేరళలో నవంబర్లో నోరోవైరస్ తొలి కేసు నమోదైంది. ఆహారం లేదా కలుషిత ద్రవాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారిలో వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పెరుగుతున్న కేసులు
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 4,518 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,81,335కు చేరింది. తాజాగా 9 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 5,24,701కి పెరిగింది. క్రియాశీల కేసుల సంఖ్య 25,782కు చేరింది. కొత్తగా 2,779 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ అయిన వారి సంఖ్య 4,26,30,852కు చేరింది.