న్యూఢిల్లీ: భారత సైన్యానికి సంబంధించిన అత్యంత సున్నిత సమాచారాన్ని పాక్ నిఘా బృందాలకు అందజేస్తున్న ఇద్దరు గూఢచారులను అమృత్‌సర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పాలక్ షేర్ మసిహ్, సూరజ్ మసిహ్లు పాక్ నిఘా ఆపరేటివ్స్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడి మిలిటరీ ఎయిర్‌బేస్, ఆర్మీ కంటోన్మెంట్‌కు సంబంధించి కీలక సమాచారం, ఫొటోలను వారు పాకిస్థాన్‌కు లీక్ చేస్తున్నట్టు గుర్తించారు. అమృత్సర్ సెంట్రల్ జైల్లో ఉన్న అమృత్ సింగ్ తో నిందితులకు సంబంధాలు ఉన్నాయని, అతడి ఆదేశానుసారమే వారు భారత మిలిటరీ సమాచారాన్ని సేకరించారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
పోలీసుల నుంచి తప్పించుకోబోయి ; నదిలోకి దూకిన ఉగ్రవాద సానుభూతిపరుడు
న్యూఢిల్లీ, మే 4: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, ఆహారం అందించాడని అనుమానిస్తున్న ఒక సానుభూతిపరుడు భద్రతా దళాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలోకి దూకి నీట మనిగి మరణించాడు. కుల్గాం జిల్లాలో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే 23 ఏండ్ల వ్యక్తిని ఉగ్రవాదులకు సహకరించాడన్న అనుమానంతో పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. కుల్గాంలోని తంగ్‌మార్గ్‌లో తాను ఉగ్రవాదులకు ఆహారాన్ని సమకూర్చానని, అడవిలో రహస్యంగా ఉన్న వారికి రవాణా ఏర్పాట్లలో సహకారం అందించానని తెలిపాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఉన్నట్టు చెబుతున్న అటవీ ప్రాంతానికి పోలీసులు అతడిని ఆదివారం తీసుకుని వెళ్తుండగా, తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ నదిలో దూకి నీటిలో మునిగి మరణించాడు.