న్యూఢిల్లీ: మణిపూర్ నుంచి బయల్దేరిన మూడు గద్దల్లో రెండు సోమాలియాకు సురక్షితంగా చేరుకున్నాయి. మణిపూర్ అమూర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా వీటిని పంపించారు. యుక్త వయసు గల మగ గద్ద అపాపంగ్, తక్కువ వయసు గల ఆడ గద్ద అలంగ్, యుక్త వయసు గల ఆడ గద్ద అహు ఈ నెల 11న బయల్దేరాయి. వీటికి మణిపూర్ అడవుల్లో శాటిలైట్ ట్యాగ్స్‌ను అమర్చారు.
ఇవి మధ్య భారతంలో దాదాపు 3,100 కి.మీ., అరేబియా సముద్రంపై నుంచి ప్రయాణించి సోమాలియా చేరుకోవలసి ఉంటుంది. వీటిలో అపాపంగ్ మొదట సోమాలియాకు చేరుకుంది. ఇది 76 గంటలపాటు ఎక్కడా ఆగకుండా ప్రయాణించింది. ఆ తర్వాత అలంగ్ సోమాలియాకు చేరుకుంది. మూడో గద్ద అహు సోమాలియాకు చేరువలో ఉంది. తమిళనాడు పర్యావరణం, వాతావరణ మార్పులు, అడవుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియ సాహు ఈ వివరాలను ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ అమూర్ గద్దలు అంతరించిపోయే దశలో ఉన్నాయన్నారు. వీటి బరువు 150 గ్రాములు ఉంటుందన్నారు.