నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆలయాన్ని కూల్చి దర్గాను నిర్మించారన్న వాదన తాజాగా తెరపైకి వచ్చింది. ఓ ఆలయాన్ని కూలగొట్టి సదరు దర్గాను నిర్మించారంటూ అఖిల భారతీయ సంత్ సమితి నాయకుడు, పూజారి అనికేత్ శాస్త్రి ఆరోపణలు చేయడం ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశమైంది. ఇటీవల ఉర్సును పురస్కరించుకొని కొందరు ధూపం సమర్పించేందుకు త్రయంబకేశ్వర్ ఆలయానికి వెళ్లగా భద్రతా సిబ్బంది అడ్డుకోవడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అనంతరం ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. మరుగున పడిపోతున్న ఈ అంశాన్ని పూజారి మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. బాబా గోరఖ్‌నాథ్ గుహను కూల్చి దర్గాను నిర్మించారని ఆ పూజారి ఆరోపించారు. చరిత్రకారులు ఈ విషయాన్ని తనకు తెలిపారని ఆయన వెల్లడించారు. దర్గా కింద వినాయకుడి విగ్రహం, హిందూ మతానికి సంబంధించిన చిహ్నాలు, దేవతల విగ్రహాలు ఉన్న ట్టు సమాచారం ఉందన్నారు. పురావస్తు శాఖాధికారులు తవ్వకాలు చేపట్టాలని కోరారు. సర్వే నిర్వహించి నిజానిజాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.