Twisha Sharma : నటి, మోడల్ త్విషా శర్మ మృతి ఘటనలో ఆమె అత్త గిరిబాలా సింగ్, భర్త సమర్ధ్ సింగ్‌లకు మధ్యప్రదేశ్ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ జైలులో ఉన్నారు. అయితే, వీరికి అక్కడ వీఐపీ ట్రీట్మెంట్ అందుతోందనే ప్రచారం జరుగుతోంది. భద్రతా కారణాల రీత్యా గిరిబాలా సింగ్‌ను అక్కడి జైలులోని ఆస్పత్రిలో ఉంచారు. అలాగే, సమర్ద్ సింగ్‌ను అనారోగ్య కారణాలతో అక్కడే ఉంచినట్లు తెలుస్తోంది.
దీంతో నిందితులు ఇద్దరికీ అక్కడ వీఐపీ ట్రీట్మెంట్ అందుతోందనే ప్రచారం జరుగుతోంది. వీరున్న ఆస్పత్రిలో సాధారణ జైలులోకంటే మెరుగైన సౌకర్యాలే అందుతాయి. జైలు అధికారులు వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు కోర్టులో విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అత్త గిరిబాలా సింగ్ మాట్లాడుతూ తన ప్రాణాలకు హాని ఉందని వెల్లడించారు. తన కొడుకు సమర్ధ్ సింగ్‌పై త్విషా శర్మకు చెందిన ఒక లాయర్ దాడి చేశాడని ఆమె ఆరోపించారు. జడ్జిగా తన సర్వీసులో చాలా మంది క్రిమినల్స్‌కు శిక్షలు విధించానని, ఇప్పుడు అలాంటి వారితోనే తాను జైలులో ఉండాల్సి వస్తోందన్నారు.
జైలులోని ఖైదీల నుంచి తనకు, తన బిడ్డకు హాని ఉందని చెప్పారు. అయితే, సమర్ద్ సింగ్‌పై లాయర్ దాడి చేసిన ఘటనపై సీసీ కెమెరా వీడియో పరిశీలించాలని త్విష తరఫు లాయర్లు కోర్టును కోరారు. ఇదే సమయంలో జైలులో వారు ఉండే చోట సీసీ కెమెరాలు సహా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో గిరిబాలా సింగ్, సమర్ధ్ సింగ్‌కు తగిన భద్రత కల్పించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం భోపాల్ సెంట్రల్ జైలులో వీరికి తగిన భద్రత కల్పిస్తున్నారు. ఇదే సమయంలో వీఐపీ ట్రీట్మెంట్ కూడా లభిస్తోందని ప్రచారం జరుగుతోంది. దీంతో హైప్రొఫైల్ కేసులలో నిందితులకు ఇలా వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.