Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న త్విషా భర్త సమర్ద్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌కు సీబీఐ రిమాండ్ విధించింది. దీనిపై మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2 వరకు ఇద్దరికీ సీబీఐ రిమాండ్ కొనసాగనుంది. ఈ కేసులో గిరిబాలా సింగ్‌ను గురువారం సాయంత్రం సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందే భర్త సమర్ధ్ సింగ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.
దీంతో ఇద్దరినీ ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని మధ్యప్రదేశ్ హైకోర్టును సీబీఐ కోరింది. దీనికి హైకోర్టు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 2 వరకు ఇద్దరూ సీబీఐ కస్టడీలోనే ఉంటారు. అవసరమైతే కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరే అవకాశం ఉంది. ఈ పరిణామంపై త్విషా శర్మ లాయర్ అనురాగ్ శ్రీవాస్తవ స్పందించారు. ఇద్దరు నిందితులు సీబీఐ కస్టడీలో ఉండటంతో ప్రస్తుతం కేసు విచారణ సరైన దిశలోనే వెళ్తుందని ఆయన అన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కావాలని సెషన్స్ కోర్టులో గిరిబాలా పిటిషన్ దాఖలు చేయగా అనుమతించింది.
ఈ బెయిల్‌ను సవాలు చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు గిరిబాలా ముందస్తు బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో ఆమెను సీబీఐ అరెస్టు చేసింది. అంతకుమందు గత వారం నాటకీయ పరిణామాల మధ్య, హత్య జరిగిన 10 రోజుల తర్వాత భర్త సమర్ద్ సింగ్ పోలీసులకు లొంగిపోయాడు. అతడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది. నటి, మోడల్ అయిన త్విషా శర్మ ఈ నెల 12న అనుమానాస్పదంగా మరణించింది.
ఆమె మృతికి భర్త, అత్తలే కారణమని త్విషా శర్మ తల్లిదండ్రులు ఆరోపించారు. మరోవైపు ఆమె మృతదేహానికి రెండుసార్లు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, పది రోజుల తర్వాత ఆమెకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.