TVK party : తమిళనాడు (Tamil Nadu) కు చెందిన ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 17 కీలక తీర్మానాలు చేశారు. వాటిలో త్రీ లాంగ్వేజ్ పాలసీ (Three language policy) కి వ్యతిరేకంగా, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) కు వ్యతిరేకంగా, వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment bill) కు వ్యతిరేంగా చేసిన తీర్మానాలు కూడా ఉన్నాయి.
వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో టీవీకే నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రంలో ద్విభాషా పాలసీకే కట్టుబడి ఉండాలని పార్టీ నిర్ణయం చేసింది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా త్రిభాషా పాలసీని అమలు చేయాలని కోరడం సమాఖ్య విధానానికి విరుద్ధమని, రాజకీయాల కోసం మరో భాషను తమిళనాడుపై రుద్ధడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని టీవీకే తన తీర్మానంలో స్పష్టంచేసింది.
అదేవిధంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు తప్పనిసరేమీ కాదని పేర్కొంటూ దానికి వ్యతిరేకంగా టీవీకే ఒక తీర్మానం చేసింది. ప్రతిపాదిత డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుందని పేర్కొది. మరోవైపు రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం మాదక ద్రవ్యాలను నియంత్రించలేకపోవడాన్ని టీవీకే ఖండించింది. పాత పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు డీఎంకే తప్పుడు హామీ ఇచ్చిందని ఆరోపించింది.
మత్స్యకారుల అంశాన్ని కూడా టీవీకే పార్టీ తన తొలి జనరల్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తింది. మత్స్యకారుల సమస్యకు తమిళనాడు సర్కారు శాశ్వత పరిష్కారం చూపడంలేదని టీవీకే విమర్శించింది. ప్రధాని నరేంద్రమోదీ కూడా తమిళనాడు మత్స్యకారులపై వివక్ష చూపరాదని, గుజరాత్ మత్స్యకారులతో సమానంగా చూడాలని మరో తీర్మానంలో పేర్కొంది. అదేవిధంగా పరంధూర్లో న్యూ చెన్నై ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా కూడా టీవీకే తీర్మానం చేసింది.
తిరువన్మయూర్లోని రామచంద్ర కన్వెన్షన్ హాల్ టీవీకే తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కన్వెన్షన్ హాల్ బయట పార్టీ చీఫ్ విజయ్‌కి సంబంధించిన భారీ కటౌట్లు వెలిశాయి. కన్వెన్షన్ హాల్ ప్రవేశ ద్వారాన్ని తమిళనాడు సచివాలయానికి వెళ్లే ప్రవేశ ద్వారంలా డిజైన్ చేశారు. కాగా విజయ్ 2024 ఫిబ్రవరిలో రాజకీయాల్లోకి తన ప్రవేశం గురించి ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న విజయ్ పార్టీ టీవీకే ప్రథమ వార్షికోత్సవాన్ని పూర్తిచేసుకుంది.