Tamil Nadu Legislative Assembly | తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మరియు ఎమ్మెల్యే జె.సి.డి. ప్రభాకర్ తమిళనాడు శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభాకర్, గతంలో AIADMK పార్టీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ నేత. మే 11న ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయగా, ఎవరూ అడ్డుపడకపోవడంతో మే 12న అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
ఈ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్, వీసీకే మరియు వామపక్షాల మద్దతుతో విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభాకర్ ఎన్నికతో పాటు తురైయూర్ ఎమ్మెల్యే ఎం. రవిశంకర్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్‌కి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలుపగా.. ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ గౌరవపూర్వకంగా ఆయన సీటు వరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం పారదర్శకమైన పాలనను అందిస్తుందని, మహిళల భద్రత మరియు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంటూ, సభను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రభాకర్ అనుభవం తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.