చెన్నై, మే 8: తమిళనాడు రాజకీయం గంటకో మలుపు తిరుగుతున్నది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై హైడ్రామా కొనసాగుతున్నది. శనివారం ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి టీవీకే అధినేత విజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో శుక్రవారం రాత్రి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. విడుతలై చిరుతైగళ్ కట్చి(వీసీకే) నుంచి మద్దతు లేఖ అందకపోవడంతో ప్రమాణ స్వీకారంపై గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వీసీకే లేఖ కోసం గవర్నర్ ఎదురుచూస్తున్నారని లోక్‌భవన్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు గవర్నర్‌ను మూడోసారి కలిసిన విజయ్.. 116 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను అందజేశారు. 234 స్థానాలున్న శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది సభ్యుల మద్దతు అవసరం. వీసీకే, ఐయూఎంఎల్ టీవీకేకు మద్దతు తెలిపాయని, దీంతో టీవీకే బలం 120కు చేరుకుందని, శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారని అంతకుముందు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
టీవీకేకు మద్దతుపై శనివారం తమ నిర్ణయం ప్రకటిస్తామని వీసీకే శుక్రవారం రాత్రి ప్రకటించింది. లోక్‌భవన్ వర్గాల కథనం ప్రకారం శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ను కలసిన విజయ్ 116 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు సంతకాలను సమర్పించారు. అయితే వీసీకే, ఐయూఎంఎల్‌కు చెందిన అధికారిక లేఖలను సమర్పించలేదు. ఆ లేఖలను కొద్ది సేపట్లో సమర్పిస్తానని విజయ్ చెప్పినట్లు సమాచారం. మిగిలిన మద్దతు లేఖలు అందిన వెంటనే ప్రమాణ స్వీకారం గురించి గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని ఆ వర్గాలు చెప్పాయి. అయితే టీవీకేకు తాము మద్దతు ఇవ్వడం లేదంటూ ఐయూఎంఎల్ రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. డీఎంకే సారథ్యంలోని కూటమితోనే కొనసాగుతామని ఐయూఎంఎల్ ప్రకటించింది.
వీసీకే తన మద్దతు లేఖను మెయిల్ ద్వారా టీవీకేకు పంపినట్లు వార్తలు వచ్చినప్పటికీ అది నిజం కాదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి విజయ్‌కు గవర్నర్ ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇదిలా ఉంటే, ఏఎంఎంకేకు చెందిన టీటీవీ దినకరన్ శుక్రవారం రాత్రి గవర్నర్‌ను కలుసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏఐఏడీఎంకేను ఆహ్వానించాలని అర్థించారు. కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న తన పార్టీ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఏఐఏడీఎంకే నాయకుడు ఎడప్పాడి కే పళనిస్వామిని బలపరుస్తున్నట్లు దినకరన్ గవర్నర్‌కు తెలిపారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్రం దొడ్డిదారి ద్వారా గవర్నర్ పాలనను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నదని విపక్ష పార్టీలు ఆరోపించాయి. శుక్రవారం తెరవెనుక టీవీకే నేతృత్వంలోని కూటమికి మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్‌తో మాట్లాడటంతో చెన్నై వ్యాప్తంగా తీవ్రమైన చర్చలు జరిగాయి. ఆ వెంటనే, సీపీఐ వర్కింగ్ కమిటీ, సీపీఎం రాష్ట్ర నాయకత్వం కూడా విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో అసెంబ్లీలో సమీకరణాలు నాటకీయంగా మారిపోయాయి. తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే అనిశ్చితికి తెరపడే అవకాశం ఏర్పడింది.
తమిళనాడు రాజకీయాలను అస్థిరపరిచేందుకు గవర్నర్ కార్యాలయాన్ని ఉపయోగించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని వీసీకే నాయకుడు సింథనై సెల్వన్ ఆరోపించారు. ప్రజాస్వామ్య నియమాలు ప్రమాదంలో ఉన్నాయని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ఎన్నికల అనంతర పరిస్థితిని విజయ్ నిర్వహించిన తీరును ఆయన బహిరంగంగా విమర్శిస్తూ ఫలితాలు వెలువడిన వెంటనే టీవీకే అధినేత కూటమి భాగస్వాములను వ్యక్తిగతంగా ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. మద్దతు కోరుతూ వాట్సాప్ సందేశం పంపి ఆ తర్వాత స్పందించండి అని చెప్పడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అని సెల్వన్ ప్రశ్నించారు.