చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆదివారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్‌తో ప్రమాణం చేయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఫైళ్లపై సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వంలో ఒకటే అధికార కేంద్రం ఉంటుందని, అది తానేనని చెప్పారు. ‘ఇది కొత్త ప్రారంభం, నిజమైన, లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన కొత్త యుగం ప్రారంభమవుతున్నది.. ఇప్పుడే’ అంటూ చేతి గడియారం చూపించడంతో సభ హర్షధ్వానాలతో మార్మోగింది. తాను ఎలాంటి రాజ కుటుంబానికి చెందినవాడిని కాదని, ప్రజలు తనను నమ్మి అంగీకరించారని, తప్పుడు హామీలతో ఎప్పుడూ మోసం చేయనని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం తమిళనాడును రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిందని ఆరోపించారు.
ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా అధ్యయనం చేసి శ్వేతపత్రం విడుదల చేస్తామని, పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అంచనాలను అందుకోవడానికి తనకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ప్రధానంగా విద్య, ప్రజా పంపిణీ వ్యవస్థ, వైద్యం, తాగునీరు, రోడ్లు, బస్ సౌకర్యంపై దృష్టి పెడతానని తెలిపారు. స్నేహితులు, శత్రువులు అనే తేడా లేకుండా తమిళనాడులోని 8 కోట్ల మంది ప్రజలు తనవారేనని అన్నారు. ‘నేను అవినీతికి పాల్పడను, ఇతరులను కూడా అనుమతించను. నా ప్రభుత్వంలో ఎవరైనా తప్పు చేస్తే సహించను’ అంటూ హెచ్చరించారు. పిల్లలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ.. ‘విజయ్ మామా లిటిల్ ఫ్రెండ్స్, థాంక్యూ. వారి వల్లే నేను గెలిచాను.
వారి రుణం ఎలా తీర్చుకోగలను? మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విజయ్ మామా మీ కోసం అన్ని మంచి పనులే చేస్తాడు’ అని చెప్పారు. మద్దతు తెలిపిన కూటమి పార్టీల నాయకులకు, ముఖ్యంగా రాహుల్ గాంధీ, వీసీకే, ఇతర పార్టీలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. విజయ్‌తోపాటు బస్సీ ఎన్ ఆనంద్, అధవ్ అర్జునా, కేఏ సెంగొట్టయ్యన్, కేజీ అరుణ్‌రాజ్, పీ వెంకటరామనన్, సీటీఆర్ నిర్మల్ కుమార్, ఏ రాజ్‌మోహన్, కీర్తన, కేటీ ప్రభు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, విజయ్ మిత్రులు, నటి త్రిష, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేకంగా నిలిచింది ఏమిటంటే, సాధారణంగా పాటించే విధంగా రాష్ట్ర అధికారిక గీతం ‘తమిళ తల్లి’తో కాకుండా ‘వందే మాతరం’తో కార్యక్రమాన్ని ప్రారంభించడం. మొదట ‘వందే మాతరం’ తర్వాత ‘జనగణమన’, ‘తమిళ తల్లి’ గీతాలను ఆలపించారు. దీనిని బీజేపీకి ఒక రాజకీయ సందేశంగా భావిస్తున్నారు. గత వారం ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్’ సవరణకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణల ద్వారా జాతీయ గేయం ‘వందే మాతరం’ను జాతీయ గీతం ‘జనగణమన’తో సమాన స్థాయిలో ఉంచనున్నారు.
‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవం జరుపుకొంటున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం ‘వందే మాతరం’ పూర్తి వెర్షన్‌ను తప్పనిసరిగా వినిపించాల్సి ఉండడంతో, అదే విధానాన్ని అనుసరించినట్టు కనిపిస్తున్నది. విజయ్ పక్కన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ కాలంలో కాంగ్రెస్ పార్టీ మతపరమైన చిచ్చును రాజేయడానికి వందేమాతరంలోని కొన్ని పేరాగ్రాఫ్‌లను తొలగించిందని కేంద్రం చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా విమర్శించారు.