TVK campaign : కరూర్ తొక్కిసలాట (Karur stampede) దుర్ఘటనతో నిలిచిపోయిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ప్రచారం మళ్లీ మొదలుకానుంది. డిసెంబర్ మొదటి వారంలో ప్రచారాన్ని పునరుద్ధరించాలని టీవీకే చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) నిర్ణయించారు. ఈ మేరకు డిసెంబర్ 4న సేలం (Selam) లో భారీ ర్యాలీ నిర్వహించతలపెట్టారు.
అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. కార్యక్రమం కోసం సమర్పించిన దరఖాస్తును తిరస్కరించారు. ఆ తేదీన భద్రతా కారణాలవల్ల అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. పార్టీకి ఇచ్చిన లేఖలో మాత్రం భద్రతాసిబ్బంది లేకపోవడం, ఎంత మంది ప్రజలు హాజరవుతారనే కచ్చితమైన వివరాలు లేకపోవడం వంటి అంశాలను కారణాలుగా చూపారు.
భవిష్యత్తులో విజయ్ ప్రజా సమావేశాలకు అనుమతి కోరినట్లయితే కార్యక్రమం తేదీకి నాలుగు వారాల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీవీకే ప్రచారాన్ని ప్రత్యామ్నాయ తేదీల్లో నిర్వహించుకునేందుకు అనుమతి కోసం త్వరలోనే దరఖాస్తు చేసుకుంటామని పార్టీ వర్గాలు తెలిపాయి. సేలం తర్వాత ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లో కూడా విజయ్ ప్రచారం చేయాలని యోచిస్తున్నారు.