న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్న క్రమంలో పాకిస్థాన్.. విదేశాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తుర్కియేకు చెందిన టీజీసీ బుయుకడా అనే భారీ యుద్ధ నౌక తాజాగా కరాచీ తీరానికి చేరింది. జలాంతర్గాములకు వ్యతిరేకంగా పనిచేసే ఈ నౌక గస్తీ కాయడంలోనూ అందెవేసిన చేయిగా గుర్తింపు పొందింది.
తమపై సముద్ర మార్గంలో భారత్ దాడి చేసే అవకాశం ఉందని భావిస్తున్న పాకిస్థాన్ ఈ గస్తీ నౌకను తమకు అండగా తెచ్చుకున్నట్టు భావిస్తున్నారు. కాగా, భారత్-పాక్ మధ్య యుద్ధవాతావరణం ఏర్పడిన క్రమంలో చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు, ప్రతిపక్ష పార్టీలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సమావేశానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ గైర్హాజరైంది. చాలాకాలంగా ఆ పార్టీ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ వస్తోంది.