పాట్నా: కదులుతున్న రైలు నుంచి ఒక ప్రయాణికుడ్ని టీటీఈ బయటకు తోసేశాడు. (TTE Throws Passenger Out Of Train ) దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భాతర్ తికులియా గ్రామానికి చెందిన నవల్ ప్రసాద్, కోల్‌కతా వెళ్లేందుకు ఆదివారం ఉజియార్పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. జనరల్ బోగిలో ప్రయాణం కోసం టిక్కెట్ తీసుకున్నాడు. అయితే రాక్సాల్-హౌరా మధ్య నడిచే మిథిలా ఎక్స్‌ప్రెస్‌లోని స్లీపర్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి అతడు ఎక్కాడు.
కాగా, ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఆ వ్యక్తిని టికెట్ అడిగాడు. నవల్ ప్రసాద్ వద్ద జనరల్ టికెట్ ఉండటంతో జరిమానా కట్టాలని లేదా స్లీపర్ బోగి నుంచి కిందకు దిగాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో ఆ రైలు స్టేషన్ నుంచి కదలడంతో నవల్ ప్రసాద్‌ను టీటీఈ బయటకు తోసేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న నవల్ ప్రసాద్ కుటుంబ సభ్యులు తొలుత అతడ్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పాట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.