Vinesh Phogat : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana assembly elections) జులనా అసెంబ్లీ స్థానం (Julana assembly constituency) నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ (Vinesh Phogat) విజయం సాధించారు. వినేష్ ఫోగట్ తన సమీప ప్రత్యర్థిపై 6,015 ఓట్ల తేడాతో గెలుపొందారు. వినేశ్‌కు మొత్తం 65,080 ఓట్లు రాగా.. తన సమీప ప్రత్యర్థి యోగేశ్ కుమార్‌కు 59,065 ఓట్లు వచ్చాయి.
గెలుపు అనంతరం తన విజయంపై వినేశ్ ఫోగట్ మొదటిసారి స్పందించారు. ‘ఇది ఎల్లప్పుడూ దేశంలో పోరాట మార్గాన్ని ఎంచుకునే ప్రతి అమ్మాయి గెలుపు. మహిళల పోరాటం వృథా కాదు. సత్యమే గెలిచింది. ఈ దేశం నాకిచ్చిన ప్రేమను నేను ఎప్పటికీ నిలబెట్టుకుంటాను’ అని అన్నారు. ఫలితాలపై ఇంకా క్లారిటీ రాలేదని, హర్యానాలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.
వినేశ్ ఫోగట్ విజయంపై WFI మాజీ అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కూడా మాట్లాడారు. ‘ఆమె మన పేరును ఉపయోగించుకొని గెలిస్తే, దాని అర్థం మనం గొప్ప వ్యక్తులం. నా పేరుకు అంత శక్తి ఉంది. నా పేరుతో గెలవడం ద్వారా ఆమె పడవ దాటింది. కానీ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయింది’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు బజరంగ్ పునియా మాట్లాడుతూ.. భారతదేశ బిడ్డ వినేశ్ ఫోగట్‌కు అభినందనలు. ఈ పోరు కేవలం ఒక్క జులనా సీటు కోసమే కాదు.. పార్టీల మధ్య కాదు. ఈ పోరాటం దేశంలోని బలమైన అణచివేత శక్తులకు వ్యతిరేకంగా జరిగింది. ఇందులో వినేశ్ విజేతగా నిలిచింది’ అన్నారు.