Ayodhya Pran Pratishtha | అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయంలో 51 అంగుళాల రామ్‌లల్లా అచలమూర్తితో పాటు ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు అయోధ్యకు చెందిన సాధువు మహంత్ కమలనయన్ దాస్ పేర్కొన్నారు. రామ్‌లల్లా విరాజ్మాన్ విగ్రహాన్ని కదిలే విగ్రహంగా భావిస్తారని.. దీన్నే ఉత్సవ మూర్తిగా పరిగణిస్తారన్నారు. ప్రస్తుతం ప్రతిష్టించబోయే 51 అంగుళాల విగ్రహం అచల మూర్తిగా ఉంటుందని.. దాన్ని కదిలించలేరన్నారు. నలుగురు సోదరులతో కలిసి ఉన్న ఉత్సవ మూర్తికి పూజలు, హారతి ఉంటుందన్నారు. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో ఉత్సవ విగ్రహంతోనే ఊరేగింపు ఉంటుందన్నారు. అచల విగ్రహం 51 అంగుళాల ఎత్తు వరకు ఉంటుంది.
దీంతో భక్తులు తేలికగా దర్శనం చేసుకుంటారని.. పాత విగ్రహం కేవలం ఆరు అంగులాలు మాత్రమే ఉండగా.. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల, హనుమాన్ విగ్రహాలు సైతం మూడు అంగులాలు మాత్రమే ఉంటాయన్నారు. శంకరాచార్య జగద్గురు అవిముక్తేశ్వరానంద లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. శంకరాచార్య జగద్గురు అవిముక్తేశ్వరానంద రామ మందిరం కోసం ఎంత పోరాటం చేశారో తెలియదన్నారు. అయితే, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్‌కు జగద్గురువు అవిముక్తేశ్వరానంద సరస్వతి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాత్కాలిక ఆలయంలో ఉన్న రాంలాలా విగ్రహంతో పాటు పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే.