న్యూఢిల్లీ : అమెరికాకు వెలుపల ఉన్న హెచ్-1బీ వీసాదారుల్లో ఆందోళన, గందరగోళం, ఆగ్రహం కలగలిసి కనిపించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా వార్షిక రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచడమే దీనికి కారణం. ఈ ప్రకటన వచ్చిన వెంటనే టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఒక రోజులోనే తిరిగి అమెరికాలో ఉండాలని ఆదేశించాయి. దీంతో వీరంతా తమ ప్రణాళికలను వదిలిపెట్టి, ఆదరాబాదరాగా విమానాశ్రయాలకు పరుగులు తీశారు. ఇదిలావుండగా, వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు శనివారం మాట్లాడుతూ, హెచ్-1బీ వీసా వార్షిక రుసుము 1 లక్ష డాలర్లు నిబంధన కొత్త దరఖాస్తులకే వర్తిస్తుందని చెప్పారు. ప్రస్తుత, రెన్యువల్ చేయించుకునేవారికి వర్తించదని వివరించారు. ట్రంప్ ప్రకటనతో సిలికాన్ వ్యాలీలో కూడా ఆందోళన చెలరేగింది.
అయితే, కొత్త నిబంధన అమల్లోకి వస్తే, తమను తిరిగి అమెరికాలో ప్రవేశించనివ్వరనే ఆందోళనతో చాలా మంది భారతీయులు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి తిరిగి వెళ్లిపోయారు. కుటుంబం కావాలా? అమెరికాలో ఉండటం కావాలా? తేల్చుకోవలసిన పరిస్థితి వచ్చిందని ఓ భారీ టెక్ కంపెనీలో పని చేస్తున్న భారతీయ ఇంజినీరు చెప్పారు. ఆయన భార్య శాన్ఫ్రాన్సిస్కో నుంచి దుబాయ్ వెళ్లే విమానంలో ఉన్నారు. ఆ విమానం శుక్రవారం సాయంత్రం 5.05 గంటలకు బయల్దేరవలసి ఉండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన అత్తగారికి అనారోగ్యంగా ఉందని, ఆమెను చూసుకోవడం కోసం తన భార్య భారత దేశానికి వెళ్తున్నారని తెలిపారు. తన భార్య కూడా హెచ్-1బీ వీసాదారేనన్నారు. చాలా మంది ఇండియన్ ప్యాసింజర్స్ అర్ధాంతరంగా విమానం నుంచి దిగిపోవడంతో విమానం బయల్దేరడం మూడు గంటలు ఆలస్యమైంది.
చైనీస్ సామాజిక మాధ్యమం రెడ్‌నోట్‌లో కూడా కొందరు హెచ్-1బీ వీసాదారులు తమ అనుభవాలను పంచుకున్నారు. చైనాలో లేదా ఇతర దేశంలో దిగిన కొన్ని గంటలకే తిరిగి అమెరికాకు ప్రయాణమైనట్లు తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా ఇదే విధంగా ఆత్రుతగా అమెరికాకు వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రయాణాలపై నిషేధం అమల్లోకి రావడానికి ముందే వెళ్లామన్నారు. ‘ఎమిలీస్ లైఫ్ ఇన్ ఎన్వై’ యూజర్ ఇచ్చిన పోస్ట్‌లో, తాను నిరాశ, నిస్పృహ, ఆశాభంగం, విచారం కలగలిసిన భావాలతో ఉన్నానని తెలిపారు. తాను న్యూయార్క్ నుంచి పారిస్ వెళ్లే విమానం ఎక్కానని చెప్పారు. విదేశాల్లో ఉన్న ఉద్యోగులు తక్షణమే తిరిగి అమెరికాకు రావాలని తమ కంపెనీ నుంచి లేఖ వచ్చిందన్నారు. దీంతో తాను వణికిపోయానని.. కెప్టెన్‌ను బతిమాలితే దిగిపోవడానికి అనుమతించారని తెలిపారు.