Amit Malviya | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి భారత రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఆపరేషన్ సమయంలో ఐదు జెట్ విమానాలు కూలిపోయాయంటూ ఆయన చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందిస్తూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘మోదీజీ.. ట్రంప్ చెబుతున్న ఐదు జెట్ల వెనుక ఉన్న నిజం ఏమిటి? దేశం తెలుసుకోవాలనుకుంటోంది’ అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వాన్ని నిర్ధిష్టమైన వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఐటి సెల్ ప్రముఖ్ అమిత్ మాలవీయ ఘాటుగా స్పందించారు. ‘ట్రంప్ ఏ దేశానికి చెందిన జెట్లు కూలాయన్న విషయాన్ని చెప్పలేదు. కానీ, రాహుల్ మాత్రం పాకిస్థాన్ అధికార ప్రతినిధిలా ప్రవర్తిస్తున్నారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ అమిత్ మాలవీయ ‘ఆయన దేశద్రోహ మనస్తత్వం కలవాడు. పాకిస్థాన్‌ను సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ యువరాజు భారతీయుడో లేక పాకిస్థానీ నాయకుడో ప్రజలకు చెప్పాలి’ అంటూ తీవ్రంగా స్పందించారు. అలాగే, పాకిస్థాన్ ఇప్పటికీ ఆపరేషన్ సిందూర్ దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నదనీ, అందుకే రాహుల్ గాంధీ బాధపడుతున్నట్లు కనిపిస్తున్నదని అన్నారు. భారత సైన్యం పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ అసహనం వ్యక్తం చేస్తోందని మాలవీయ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి. ట్రంప్ చేసిన అస్పష్ట వ్యాఖ్యలపై అధికారిక సమాచారం లేనప్పటికీ, దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ముదురుతున్నది.