చెన్నై, మే 18: ఆర్బీఐకి చెందిన వందల కోట్ల రూపాయలు తరలిస్తున్న ట్రక్ ఒకటి చెన్నైలోని తాంబరం వద్ద హఠాత్తుగా నిలిచిపోవటంతో ఆర్బీఐ అధికారులు, పోలీసులు టెన్షన్ టెన్షన్‌గా గడిపారు. రెండు భారీ కంటైనర్ ట్రక్కుల్లో రూ.1070 కోట్ల రూపాయల నగదును విల్లుపురం జిల్లాలోని వివిధ బ్యాంకులకు తరలించడానికి చెన్నై ఆర్బీఐ శాఖ గురువారం ఏర్పాట్లు చేసింది. తాంబరంను దాటుతుండగా రూ.535 కోట్ల నగదున్న ఒక ట్రక్‌లో హఠాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ముందుకు వెళ్లడానికి మొరాయించింది. మెకానిక్స్ వచ్చినా వాహనం ముందుకు కదల్లేదు. దీంతో ట్రక్‌ను సమీపంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధాలోకి పోలీసు ఉన్నతాధికారులు తరలించారు. ఇనిస్టిట్యూట్ వద్ద భారీ ఎత్తున భద్రతా బలగాల్ని మోహరించారు.