న్యూఢిల్లీ, జూన్ 8: వైఫల్యాలను కూడా కప్పిపుచ్చి.. మసిపూసి మారేడుకాయ చేసి వాటిని విజయాలుగా గప్పాలు కొట్టుకోవడంలో బీజేపీ నేతలది అందెవేసిన చెయ్యి. అలాంటి కమలదళం ‘మహమ్మద్ ప్రవక్త’ వివాదంలో త్రిశంకు స్వర్గంలో చిక్కుకుపోయింది. అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తుండటంతో సర్దిచెప్పుకోలేక నీళ్లు నములుతున్నది. రాజకీయంగా బీజేపీని ఇరుకునపెట్టగల ఇలాంటి గోల్డెన్ ఛాన్స్‌ను విపక్షాలు మిస్ చేసుకుంటున్నాయి.
విపక్షం నుంచి ఒక్క టీఆర్ఎస్ మాత్రమే ఈ అంశంలో మోదీ సర్కారును గట్టిగా నిలదీసింది. ఈ మేరకు ఇంగ్లిష్ న్యూస్ వెబ్సైట్ ‘ది వైర్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ‘బీజేపీ నేతలు చేసిన తప్పుకు అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ఎందుకు తలదించుకోవాలి?’ అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల మోదీ సర్కారును ప్రశ్నించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇలాంటి సునిశిత వ్యాఖ్యలు, ప్రశ్నలతో బీజేపీని ఇరుకున పెట్టడంలో మిగతా పార్టీలు ఘోరంగా విఫలమైనట్టు వెల్లడించింది.