హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: సామాన్యుడిపై కేంద్రం మోపుతున్న ధరల భారం, ద్రవ్యోల్బణం, ఆహార పదార్థాలపై జీఎస్టీ బాదుడు, అగ్నిపథ్ అంశాలపై పార్లమెంట్ రెండో రోజు కూడా దద్దరిల్లింది. టీఆర్ఎస్తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీల ఆందోళనలతో ఉభయసభలు మంగళవారం స్తంభించాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బుధవారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ప్రారంభం కాగానే టీఆర్ఎస్, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఇతర విపక్ష ఎంపీలు రెండు సభల్లో వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘ప్రజలపై గబ్బర్ సింగ్ మళ్లీ దాడి చేశాడు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ధరలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసన గళాన్ని పెంచారు. ఆందోళనలతో ఉభయ సభలు తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత వెంటనే సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. ప్రజల సమస్యలపై విస్తృత స్థాయిలో చర్చించాలని ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల నిరసన
పార్లమెంట్ ఉభయసభలు తొలుత వాయిదా పడగానే టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్, దీవకొండ దామోదర్‌రావు, బడుగుల లింగయ్యయాదవ్, బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పోతుగంటి రాములు, గడ్డం రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
ప్రజావ్యతిరేక, నిరంకుశ కేంద్ర ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేకే, నామా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను తక్షణమే ఉభయసభల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. విపక్షాలతో కలిసి తాము చేస్తున్న ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్రం ప్రజలపై భారాలు మోపుతూ, భయాందోళనలకు గురిచేస్తున్నదని విమర్శించారు. తెలంగాణలోని వరదలు కేంద్ర పాలకులకు, బీజేపీ నాయకులకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ, బాధితులను ఆదుకొంటున్నారని చెప్పారు.
గత 4 నెలల్లో అనేక చర్యలు తీసుకున్నాం..
పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రమంత్రులు పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు సరఫరా వైపునకు సంబంధించి గత 4 నెలల్లో దిగుమతి సుంకాల తగ్గింపు, వంట నూనెల నిల్వ పరిమితి విధింపు వంటి పలు చర్యలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు తెలిపారు.
2019 నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశంలో 36.29 లక్షల సైబర్ సెక్యూరిటీ ఘటనలను గుర్తించామని కేంద్రమంత్రి అజయ్‌కుమార్ మిశ్రా లోక్‌సభలో పేర్కొన్నారు. గత ఐదేండ్లలో సాయుధ దళాల్లో 819 మంది జవాన్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్ రాజ్యసభలో తెలిపారు. 2022-23లో దేశ ఆర్థిక వ్యవస్థ 8-8.5 వృద్ధి సాధించే దిశగా వెళ్తున్నదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎం కిసాన్ కింద 10.26 కోట్ల మంది రైతులకు రూ.21,924 కోట్లు విడుదల చేశామని వ్యవసాయ మంత్రి తోమర్ తెలిపారు.
సమాధానం చెప్పకపోవడం అన్‌పార్లమెంటరీ కాదా?
పెరుగు, పన్నీర్ వంటి పదార్థాలపై కూడా జీఎస్టీ వేయడం దారుణమని రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ధరలపై ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, పార్లమెంట్లో చర్చ జరగనీయకుండా పారిపోతున్న ప్రధాని మోదీ తీరు అన్‌పార్లమెంటరీ కాదా? అని కాంగ్రెస్ నేత రాహుల్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ‘డాలర్లో రూపాయి మారకం విలువ రూ.80 దాటిపోయింది. గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి క్రాస్ అయింది. దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిపోతున్నది. ఇప్పుడు ఆహార పదార్థాలపై జీఎస్టీ భారం వేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను లెవనెత్తనీయకుండా ఎవరూ ఆపలేరని, ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.