(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘నయా భారత్’, ‘వికసిత్ భారత్’ అంటూ ఒకవైపు ఆర్భాటపు ప్రచారాల్లో మునిగిపోతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. దేశంలో పెరుగుతున్న విద్వేష దాడులపై నోరుమెదపడం లేదు. జాతి వివక్ష దాడులతో సొంత పౌరులపైనే పేట్రేగిపోతున్న మూకలను నియంత్రించడం లేదు. త్రిపుర విద్యార్థి హత్యతో ఈశాన్యం భగ్గుమంటున్నప్పటికీ.. ఎన్డీయే సర్కారు చోద్యం చూస్తున్నది. దీంతో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏంజెల్ చక్మా(24) అనే త్రిపుర యువకుడు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ నెల 9న స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో ఏంజెల్ తన సోదరుడు మైఖేల్‌తో వస్తువులు కొనుగోలు చేస్తున్నాడు. ఈ సమయంలో ఓ మూక అక్కడికి వచ్చి జాతివివక్ష వ్యాఖ్యలు చేసింది. తాము చైనీయులము కాదని, భారతీయులమేనని ఏంజెల్ బదులిచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ఆ మూక దాడికి తెగబడింది. తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఏ పత్రాలు చూపించాలని ఏంజెల్ చెప్తుండగానే.. ఆగ్రహానికి లోనైన ఆ మూక కత్తులతో ఏంజెల్ మెడ, వెన్నుపై విరుచుకుపడింది. దీంతో గత శుక్రవారం అతడు కన్నుమూశాడు.
ఏంజెల్ మృతితో ఈశాన్య రాష్ర్టాలు ఆందోళనలతో అట్టుడికాయి. తమపై వివిధ రాష్ర్టాల్లో దాడులు జరుగుతున్నాయని, ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని ది త్రిపుర చక్మా స్టూడెంట్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈశాన్యంలోని పలు రాష్ర్టాల్లో బంద్‌లు, నిరసనలు హోరెత్తుతున్నాయి.
త్రిపుర యువకుడి హత్యా ఘటనపై ప్రతిపక్ష నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో సమాజంలో అసహనం అంతకంతకూ పెరిగిపోతున్నదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. జాతివివక్ష పేరిట పౌరులపై మూకదాడులు జరుగుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘నయా ఇండియా’ అంటే ఇదేనా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఛత్తీస్‌గఢ్, బెంగాల్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికుల మీద కూడా ఇదే నెలలో మూక దాడి జరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామ్‌నారాయణ్ బఘేల్ (31)ను కేరళలోని పాలక్కాడ్‌లో ‘నువ్వు బంగ్లాదేశ్ నుంచి వచ్చావా?’ అంటూ దుర్భాషలాడుతూ కొందరు దాడికి యత్నించారు. మరోవైపు, బెంగాల్‌కు చెందిన జూయెల్ రాణాపై ఒడిశాలోని సంబల్పూర్లో ఈ నెల 24న దాడులు జరిగాయి. బాధితులిద్దరూ చనిపోయారు.