కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సుఖేందు శేఖర్ రేకు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. (TMC MP Summoned By Cops) ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారానికి సంబంధించి పలు ప్రశ్నలను ఎంపీ సుఖేందు లేవనెత్తారు. ఈ కేసుపై సీబీఐ న్యాయంగా వ్యవహరించాలని ఆయన కోరారు. తొలుత సూసైడ్ స్టోరీ చెప్పిన మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ కమిషనర్‌ను కస్టడీలో విచారించాలని డిమాండ్ చేశారు. హాల్ గోడను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించారు. అలాగే సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత స్నిఫర్ డాగ్‌ను ఎందుకు ఉపయోగించారంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఆయనను అధికార ప్రతినిధి పదవి నుంచి టీఎంసీ తొలగించింది.
కాగా, టీఎంసీ ఎంపీ సుఖేందు ఈ కేసు పట్ల తప్పుడు సమాచారం ప్రచారం చేశారని కోల్‌కతా పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయనకు సమన్లు జారీ చేశారు. అలాగే ఇదే తరహా ప్రశ్నలు లేవనెత్తిన బీజేపీ నాయకుడు లాకెట్ ఛటర్జీ, ఇద్దరు వైద్యులైన కునాల్ సర్కార్, సుబర్నో గోస్వామికి కూడా పోలీసులు నోటీసులు పంపారు.